4 July, 2026 | 1:52 PM

ప్రతి అర్హుడి ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం: హరిప్రియ నాయక్

04-07-2026 12:43 PM

ఇల్లందు, జూలై 4 (విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నియమించిన బీఎల్‌ఏలు సైనికుల్లా బాధ్యతతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ ఇల్లందు నియోజకవర్గ ఇన్‌చార్జి బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. ఇల్లందు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మండల బీఎల్‌ఏలతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి అర్హుడి ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ప్రతి బీఎల్‌వో నిర్వహించే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగడంతో పాటు కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణలు పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలని తెలిపారు. ముఖ్యంగా మహిళల ఓట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతి బూత్ పరిధిలోని ఓటర్లకు అవసరమైన సహకారం అందించి వారి సందేహాలను నివృత్తి చేస్తూ బీఎల్‌వోలతో సమన్వయంగా పనిచేయాలని కోరారు. కొన్ని చోట్ల అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి ఏ ఒక్క అర్హుడూ ఓటు హక్కు కోల్పోకుండా బీఆర్‌ఎస్ శ్రేణులు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.