ZPTC to CM: 20 ఏళ్ల రాజకీయ జీవితంపై సీఎం రేవంత్ ఎమోషనల్ పోస్ట్
హైదరాబాద్: 20 ఏళ్ల రాజకీయ జీవితంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఎక్స్ లో భావోద్వేగంతో పోస్టు చేశారు. మిడ్జిల్ ప్రారంభమైన రాజకీయ జీవితాన్ని(CM Revanth Reddy Political Journey) రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. రెండు దశాబ్దాల ప్రజా జీవితం మరపురాని మధుర జ్ఞాపకం అన్నారు. రేవంత్ రెడ్డిగా మొదలైన ప్రమాణం.. రేవంతన్నగా నిలిచే స్థాయికి చేరిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయమని సూచించారు. ప్రతి సందర్భం, సంఘటన, సంఘర్షణలో అండగా ఉన్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత సేవ చేయాలనే దే నా సంకల్పమని పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో శ్రామికుడిగా పనిచేస్తానని హామీ ఇస్తున్నానని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే సేవకుడిగా ఉంటామని స్పష్టం చేశారు. రేవంతన్నగా ప్రజల హృదయాల్లో మరింత స్థానం సంపాదించుకుంటామని సీఎం వెల్లడించారు.
''లక్షల అక్షరాలతో రాసినా… కోట్ల పదాలను కూర్చి చెప్పినా… తరగని మధుర జ్ఞాపకం… ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం. నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై… నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం. ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు. ఇదే స్ఫూర్తితో, ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో, మీ అందరి ఆశీర్వాద బలంతో భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా,ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా… అన్నింటికీ మించి రేవంతన్నగా… మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను.'' అని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్టులో తెలిపారు.






