8 March, 2026 | 1:42 AM

ఫస్ట్ ఇరాన్.. నెక్ట్స్ క్యూబా!

07-03-2026 12:31 AM
  1. అంతు చూస్తామని ట్రంప్ హెచ్చరిక
  2. ఇరాన్ నావికా దళాన్ని నాశనం చేశామని ప్రకటన
  3. ఇరాన్ అధికారులు కాళ్లబేరానికి వచ్చారన్న అగ్రరాజ్యం అధినేత

వాషింగ్టన్, మార్చి 6 : మొదట ఇరాన్ విషయం తేల్చిన తర్వాత క్యూబాపై దృష్టి సారిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2025 మేజర్ లీగ్ సాకర్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంటర్ మయామి జట్టుకు వైట్‌హౌస్‌లో ట్రంప్ ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరాన్ పని ముగించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ఇజ్రాయెల్‌తో కలిసి అనుకున్న దానికంటే వేగంగానే తమ దళాలు ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నాయని తెలిపారు. వరుస దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యాలు కూడా భారీగా క్షీణించాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్, అమెరికాకు ఉన్నట్లు ఇరాన్‌కు సమర్థవంత వైమానిక దళం లేదని తెలిపారు. ఇప్పటికే ఇరాన్ నావికా దళాన్ని నాశనం చేశామని ప్రకటించారు. 

మూడు రోజుల్లో 24 ఇరాన్ నౌకలను తుడిచి పెట్టడంతో ఆ దేశ అధికారులు కాళ్ల బేరానికి వచ్చారని ట్రంప్ చెప్పారు. అణు ఒప్పందంపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు తమకు చెబితే తోసిపుచ్చామని, ఇప్పటికే ఆలస్యమైనట్లు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమతో ఒప్పందం కోసం క్యూబా కూడా వేచిచూస్తోందని ట్రంప్ తెలిపారు.

కానీ ఆ దేశ ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి తీవ్రమైన ముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఇరాన్ పని ముగిసిన తర్వాత క్యూబా సంగతి చూస్తామని స్పష్టం చేశారు. అయితే అది ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు.