3 May, 2026 | 1:33 PM

వివేక్ విహార్‌లో అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి

03-05-2026 11:56 AM

న్యూఢిల్లీ: ఢిల్లీలోని వివేక్ విహార్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదరంలో కనీసం తొమ్మిది మంది మరణించారని ఢిల్లీ అగ్నిమాపక సేవా అధికారులు తెలిపారు. వివేక్ విహార్ ఫేజ్-Iలోని బీ బ్లాక్‌లోని ఓ నివాస భవనంలో రెండవ, మూడవ, నాలుగవ అంతస్తులలోని ఫ్లాట్లలో తెల్లవారుజామున సుమారు 3:48 గంటలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

భవనంలోని ఆరు ఫ్లాట్లలో గృహోపకరణాలకు నిప్పంటుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. అగ్నిమాపక చర్యల సమయంలో సుమారు 10 నుండి 15 మందిని రక్షించి, స్వల్ప గాయాలైన ఇద్దరిని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు. వివిధ అంతస్తుల నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఢిల్లీ పోలీసు క్రైమ్ బృందానికి అప్పగించారని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డివిజన్ ఆఫీసర్ (డీఓ) ఎం.వర్మ తెలిపారు. కొన్ని గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని, ఇంట్లో ఏసీ పేటి మంటలు చెరరేగాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి విచారణ, చర్యలు కొనసాగుతున్నాయి.