23 August, 2026 | 7:28 PM

మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం

23-08-2026 06:18 PM

బాన్సువాడ, ఆగస్టు 23 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన యువకుడు మంద శ్రీకాంత్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, బ్రెయిన్‌కు సంబంధించిన సమస్యతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మల్లంపేట్ గ్రామ పెద్దలు, నాయకులు స్పందించి శ్రీకాంత్ కుటుంబానికి ఆదివారం ఆర్థిక సహాయం అందించారు. మల్లంపేట్ గ్రామానికి చెందిన నాయకులు, ఆర్కల అనంతస్వామి ముదిరాజ్ (మాజీ సర్పంచ్, మాజీ కౌన్సిలర్) ఆధ్వర్యంలో ఆయన స్నేహబృందం కలిసి శ్రీకాంత్ తల్లి మంద విటవ్వకు రూ.50,000 చెక్కును అందజేశారు. శ్రీకాంత్ మిత్రుడు పూజం జీవన్ మాట్లాడుతూ.. తన మిత్రుడి పరిస్థితిని తెలుసుకుని తాను సహాయం కోరిన వెంటనే స్పందించి, ఎలాంటి సంకోచం లేకుండా పెద్ద మనసుతో ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చిన మల్లంపేట్ గ్రామపెద్దలు, నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కష్ట సమయంలో అందించిన సహాయాన్ని తాము ఎప్పటికీ మరచిపోలేమని అన్నారు.