ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం
తలకొండపల్లి: ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు చీపునుంతల సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ. శనివారం గ్రామానికి చెందిన మద్దూరి సువర్ణ-వెంకటయ్య దంపతుల కుమార్తె శాలిని వివాహ మహోత్సవానికి సర్పంచ్ లక్ష్మమ్మ, నాయకులు మాలే రవీందర్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు గ్రామంలోని నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు 'పెళ్లి కానుక'ను అందజేస్తున్నట్లు తెలిపారు.
పేద కుటుంబాలపై పెళ్లి భారమై కుంగిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగానే శాలిని వివాహానికి ₹50,000 నగదును అందజేసినట్లు వివరించారు.సమయానికి ఆర్థిక సాయం అందించి తమ బిడ్డ పెళ్లికి అండగా నిలిచిన సర్పంచ్ లక్ష్మమ్మకు, మాలే రవీందర్ రెడ్డికి లబ్ధిదారు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.






