2 June, 2026 | 4:38 AM

జీ మీడియాకు ఫిఫా ప్రపంచకప్ ప్రసార హక్కులు

02-06-2026 01:36 AM

ముంబై, జూన్ 1 : భారత క్రీడల్లో తిరుగులేని బ్రాడ్‌కాస్టర్‌గా కొన సాగుతున్న జియో హాట్‌స్టార్‌కు బిగ్ షాక్ తగిలింది. ప్రపంచంలో నే అత్యంత ఆదరణ కలిగిన ఫిఫా ప్రపంచకప్ ప్రసార హక్కులను జీ మీడియా సొంతం చేసుకుంది. దీంతో భారత్‌లోని సాకర్ అభిమానులు జీ వేదికగా ఫిఫా వరల్డ్‌కప్‌ను వీక్షించనున్నారు. ఫిఫా, జీ మీడియా మధ్య 8 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదిరింది. 2034 వరకూ భారత్‌లో ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లను జీ సంస్థ ప్రసారం చేయనుంది.

ఈ ఒప్పంద కాలంలో మరో 34 ఈవెంట్లు కూడా జీ మీడియానే అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరించనుంది. వయాకామ్ 18 చాలా తక్కువ బిడ్‌ను సమర్పించగా ఫిఫా నిరాకరించింది. అదే సమయంలో జీ మీడియా రూ.500 కోట్ల వరకూ బిడ్‌ను దాఖలు చేసినట్టు తెలుస్తోంది. ముందు రూ.284 కోట్ల వరకే బిడ్ వేసినా తర్వాత దానిని రెట్టింపు చేసినట్టు సమాచారం. మొత్తం మీద మంచి ధరకే జీ సంస్థ ఫిఫా ఫుట్‌బాల్ ప్రసార హక్కులను దక్కించుకున్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

భారీ స్థాయిలో బిడ్డింగ్స్ రాకపోవడానికి ప్రధాన కారణం వరల్డ్‌కప్ మ్యాచ్‌ల టైమింగ్సే. ఎందుకంటే జూన్ 11 నుంచి మొదలుకానున్న ఫిఫా ప్రపంచకప్‌లో కేవలం 14 మ్యాచ్‌లో భారత కాలమానం ప్రకారం అర్థరాత్రికి ముందే మొదలవుతాయి. మిగిలిన మ్యాచ్‌లన్నీ తెల్లవారుఝామున్న షెడ్యూల్డ్‌గా ఉన్నాయి. దీంతో భారత్‌లో వ్యూయర్‌షిప్ పెద్దగా ఉండదనీ, వాణిజ్య ప్రకటనల రెవెన్యూ కూడా భారీగా పడిపోతుందని బ్రాడ్‌కాస్టర్లు చెబుతున్నారు. అందుకే ఫిఫా ప్రపంచకప్ ప్రసారహక్కులు ఆశించిన స్థాయిలో అమ్ముడుపోవడం లేదంటున్నారు.