2 June, 2026 | 3:48 AM

పవన్ సభకు అనుమతి నిరాకరణ

02-06-2026 02:58 AM
  1. రాష్ట్ర అవిర్భావ వేడుకలు.. ఉద్రిక్తతలకు అవకాశం
  2. సభాస్థలం వద్ద పార్కింగ్ సదుపాయం లేదన్న డీసీపీ
  3. హైకోర్టుకు జనసేన

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నిర్వహించాలకున్న ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’కు ఎదురు దెబ్బ తగిలింది. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూన్ 2న హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో ఈ సభను నిర్వహించాలని నిర్ణ యించారు. 

అయితే ఇటీవల ఏపీ, తెలంగాణ మధ్య జరుగుతున్న పరిణామాలు, మంగళవారం రాష్ట్ర అవతరణ దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వ వేడుకల సందర్భంగా జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆవిర్భావ వేడుకల రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు, ఆందోళనలు జరిగే అవకాశం ఉండడం, శాంతి భధ్రతల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని సోమవారం శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

సమావేశం అనుమతిపై దర్యాప్తు చేశామని, ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల రీత్యా, మరోపక్క సమావేశానికి వచ్చే రెండు వేల మంది కోసం సరిపడా పార్కింగ్ సదుపాయం లేదని తేలింది. ఈ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని జనసేన పార్టీ సభకు నిరాకరించామని డీసీపీ తెలిపారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ సభ నిర్వహించి తీరుతామని ప్రకటనలు చేసిన ఆ పార్టీ నేతలకు నిరాశే ఎదురైంది.

అయితే కోర్టు ద్వారా అనుమతి తీసుకునేందుకు జనసేన నేతలు ప్రయత్నించిన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని సమాచారం. మరి ఈ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ సభ నిర్వహణపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఆర్‌ఎస్ పార్టీ, పలువురు తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలా సభ నిర్వహిస్తారో చూస్తామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిర్వహించాలనుకున్న సభపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ‘మేం హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించడం లేదు. కేవలం సమావేశం నిర్వహించుకుంటున్నాం’ అని జనసేన నేత మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘తెలంగాణ నవ నిర్మాణ్ సభ సాధక్ సమ్మేళనం’కు అనుమతి నిరాకరణపై మహేందర్‌రెడ్డి స్పందించారు. ‘మేం నిర్వహించేది సభ కాదని, కన్వెన్షన్ హాల్‌లో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం’ అని తెలిపారు.

కేవలం సమావేశం నిర్వహించుకుంటున్నందుకు పోలీసుల అనుమతి ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. సరైన కారణాలు చెప్పకుండా పోలీసులు అనుమతి నిరాకరించారని మండిపడ్డారు. అందుకే సమావేశాన్ని నిర్వహించుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు పేర్కొన్నారు.