ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
బీసీ సంఘం జిల్లా నాయకులు దొగ్గలి శ్రీధర్
ముకరంపుర, జూలై 15(విజయ క్రాంతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.11,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని బీసీ సంఘం జిల్లా నాయకులు దొగ్గలి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే కీలకమైన సంక్షేమ పథకం అని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో అనేక విద్యాసంస్థలు విద్యార్థులపై ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేయడం, సర్టిఫికెట్లు నిలిపివేయడం, పరీక్షలకు అనుమతి నిరాకరించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.కాబట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేశారు.






