అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్
దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మార్కెట్ యాడ్ లో అకాల వర్షాలకు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం తడిసి ముద్దవుతుందని సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, సరైన నిర్ణయం తీసుకుని రైతు దగ్గర నుంచి కొనుగోలు చేసి ఉంటే రైతులకు ఈ కష్టం ఉండేది కాదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ అన్నారు. ఆదివారం మార్కెట్ యార్డ్ ను సందర్శించి రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం కల్లాల నుండి మార్కెట్ యార్డ్ వచ్చే లోపు నిర్ణయం తీసుకోకుండా అనేక కొలతలతో పరిపరి విధాలుగా కొర్రీలు పెడుతూ సమస్యను నాన్చటంవలనే మార్కెట్ యార్డులో రైతుల పంట అకాల వర్షాలకు తడిసిపోయి రైతులు చిగురుటాకుల వణుకుతున్నారని, మార్కెట్ యార్డులో గోడౌన్స్ పైరేకుల నుండి వర్షపు నీరు ఒకేసారి కింద పడటం మూలంగా ఆ వరదకు రైతుల ధాన్యం కుప్పలు తడిసి కొట్టుకుపోతున్నాయని,
గోడౌన్ సూరు రేకులకు పైపులు జత చేయక పోవడం వలన మార్కెట్ యార్డులు అకాల వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని, గోడౌన్ సూరు రేకులకు పైపులు అమర్చాలని రైతుల దగ్గర నుండి అదనంగా 5 కేజీలు తరుగు, తేమ పేరుతో తీసుకోవడం రైతుల శ్రమను దోచుకోవడమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, రైతులు సత్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.






