ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులు వెంటనే పరిష్కరించాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం, మే 11 (విజయక్రాంతి): జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం గ్రీవెన్స్ డే లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. కు వినతి పత్రం అందజేశారు.
సందర్భంగా నున్నా నాగేశ్వరరావు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ కు వివరించారు. కొనుగోలు జాబితాల్లో ఆలస్యం, కాటాలు వేయడంలో నిర్లక్ష్యం, ట్రాన్స్పోర్ట్ సమస్యలు, దళారుల అక్రమ వసూళ్లు కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యానికి వెంటనే కాటాలు వేయించి, కాటా వేసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ట్రాన్స్పోర్ట్ పేరుతో రైతుల నుంచి టిక్కీకి అదనంగా వసూలు చేస్తున్న అక్రమ దోపిడీని అరికట్టాలని, తరుగు పేరుతో జరుగుతున్న అన్యాయ కోతలను నిలిపివేయాలని కోరారు. అకాల వర్షాల వల్ల జిల్లాలో అనేక ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న, వరి పంటలు దగ్ధమవడంతో పాటు 55 గొర్రెలు మృతి చెందగా, మరో 50 గొర్రెలు గాయపడ్డాయని తెలియజేశారు. బాధిత రైతులకు పూర్తి నష్టపరిహారం చెల్లించి, ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ వినతిపత్రం అందజేసింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎర్రా శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు ఎస్. నవీన్ రెడ్డి, పాతర్లపాడు గ్రామ నాయకులు అచ్చయ్య బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.






