6 July, 2026 | 10:01 PM

భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు

06-07-2026 09:26 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ గ్రామంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అందే మహేందర్ రెడ్డి, అందే నరేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నేషనల్ హైవే పక్కన సర్వే నంబర్ 1017లో ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్ నిర్మాణం చేపట్టారని, దీనికి గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్ సహకరిస్తున్నారని ఆరోపించారు.

ఈ విషయమై కార్యదర్శికి, ఎంపీడీవో రాజ్‌కిరణ్ రెడ్డికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పూర్తి ఆధారాలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ ఫిర్యాదుపై జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తుందన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.