23 July, 2026 | 3:19 PM

నకిలీ ఎరువులతో ఎద్దుల బండిపై కలెక్టరేటుకు రైతు

23-07-2026 02:11 PM

- సీపీఐ సంఘీభావం

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): నకిలీ డీఏపీ ఎరువులు విక్రయించి మోసం చేశారని ఆరోపిస్తూ బిజినేపల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన రైతు వాడాల భీంరెడ్డి గురువారం ఎద్దుల బండిపై నకిలీ ఎరువుల బస్తాలను తీసుకుని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరాడు. తనకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నకిలీ డీఏపీ ఎరువులు విక్రయించాడని, డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా బెదిరింపులకు పాల్పడ్డాడని రైతు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో నేరుగా కలెక్టర్‌ను కలిసి న్యాయం కోరేందుకు వెళుతున్నట్లు తెలిపాడు.

రైతుకు సంఘీభావంగా సీపీఐ జిల్లా నాయకులు ఈర్ల చంద్రమౌళి, కృష్ణాజీ పాలెం గ్రామం వద్ద మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువుల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు బాధ్యుల నుంచి నష్టపరిహారం ఇప్పించాలని, లేదంటే రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న నిందితులు రైతు ఎద్దుల బండిని అడ్డుకుని మరోసారి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి, నకిలీ డీఏపీ ఎరువుల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.