23 July, 2026 | 3:33 PM

విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

23-07-2026 02:31 PM

మోవాడ్‌లో ఆరోగ్య ఉపకేంద్రం, ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. హరిత

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కె. హరిత హెచ్చరించారు. గురువారం ఆసిఫాబాద్ మండలం మోవాడ్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓపీ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్లు ఖాళీగా ఉండటంతో పాటు మందుల వివరాలు నమోదు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హాజరు పట్టికను పరిశీలించగా గత పది రోజులుగా సిబ్బంది హాజరు నమోదు లేకపోవడంతో వారికి గైర్హాజరు వేశారు.

అనంతరం గ్రామంలోని ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్, 58 మంది విద్యార్థులకు 10 మంది ఉపాధ్యాయులు ఉండడాన్ని గమనించి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన ఆమె విద్యాబోధన, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, తాగునీటి సౌకర్యాలపై ఆరా తీశారు. భోజనం నాణ్యంగా అందించడంతో పాటు విద్యార్థులకు ఆర్.ఓ. తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.ఈ సందర్భంగా గ్రామంలో సాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గ్రామ పటేల్‌ను అడిగి తెలుసుకున్న కలెక్టర్, ప్రతి కుటుంబం తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఇతర గ్రామాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల వివరాలను కూడా ఫారంలో నమోదు చేసి బీఎల్‌ఓలకు అందజేయాలని గ్రామస్తులకు సూచించారు.