పెద్ద చెరువును మింగేస్తున్న గుర్రపు డెక్క!
- ప్రాణ సంకటంలో మత్స్యకారుల జీవనోపాధి
- హామీలకే పరిమితమైన నాయకులు, అధికారులు
మహేశ్వరం, ఆగస్టు 5 (విజయక్రాంతి): మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరాల పెద్ద చెరువు ప్రస్తుతం గుర్రపు డెక్క (నీటి నాచు) తో నిండిపోయి ప్రమాదకరంగా మారుతోంది. చెరువునే నమ్ముకుని జీవిస్తున్న వందలాది మంది మత్స్యకారుల ఉపాధి రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారుతుండటంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చేపలకు ప్రాణసంకటం..
చెరువులో విపరీతంగా పెరిగిపోయిన గుర్రపు డెక్క వల్ల నీటికి గాలి ఆడక కలుషితమవుతోందని మత్స్యకారులు చెబుతున్నారు. దీనికి తోడు నీటి నాచు కూడా తోడవడంతో చేపలు ఊపిరాడక చనిపోయే ప్రమాదం నెలకొంది. నీటిలో వలలు వేయడానికి వీలుకాక చేపల వేట పూర్తిగా స్తంభించిపోతోంది.చెరువులో జీవవైవిధ్యం దెబ్బతిని, మత్స్య సంపద క్షీణిస్తోంది.
జీహెచ్‌ఎంసీ’ యంత్రాల కోసం ఎదురుచూపులు..
గుర్రపు డెక్కను తొలగించేందుకు ప్రత్యేకంగా జీహెచ్‌ఎంసీ నుండి యంత్రాలు రావాల్సి ఉందని, కానీ అక్కడ యంత్రాలు ఖాళీగా లేవని అధికారులు చేతులెత్తేస్తున్నారని మత్స్యకారులు వాపోతున్నారు. గతంలో మున్సిపల్ కమిషనర్తో పాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ (మత్స్య శాఖ) అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం శూన్యంగా మారింది.
మాట తప్పిన హామీలు!
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేఎల్‌ఆర్ సైతం గతంలో ఈ సమస్యపై సానుకూలంగా స్పందించి, చెరువులోని గుర్రపు డెక్కను తక్షణమే తొలగిస్తామని మత్స్యకారులకు హామీ ఇచ్చారు. అయితే, హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు ప్రారంభం కాకపోవడంపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మా జీవనోపాధి దెబ్బతినకుండా కేఎల్‌ఆర్ మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలి. జీహెచ్‌ఎంసీ లేదా మున్సిపాలిటీ యంత్రాల ద్వారా రావిరాల పెద్ద చెరువులోని గుర్రపు డెక్కను యుద్ధప్రాతిపదికన తొలగించి మమ్మల్ని ఆదుకోవాలి.
మత్స్య సంపదకు ముప్పు..
గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిపోవడం వల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గి చేపలు చనిపోయే ప్రమాదం ఉంది. నీటిపై మొక్కలు అల్లుకుపోవడంతో చేపల వేట తీవ్ర కష్టతరంగా మారింది. తక్షణమే స్పందించి చెరువులోని గుర్రపు డెక్కను తొలగించి, మత్స్యకారుల ఉపాధిని కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.






