1 July, 2026 | 2:25 AM

బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?

13-04-2026 11:18 AM

విరుదునగర్: తమిళనాడులోని విరుదునగర్ జిల్లా(Virudhunagar District) సత్తూరు సమీపంలో ఉన్న ఒక బాణసంచా కర్మాగారంలో సోమవారం భారీ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. అగ్నిమాపక, రెస్క్యూ శాఖ అధికారుల ప్రకారం, సత్తూరు సమీపంలోని మడత్తుపట్టిలో ఉన్న Excel బాణసంచా కర్మాగారంలో ఈ పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. 

పేలుడు సంభవించిన తర్వాత ఆ ప్రాంగణం లోపల పలువురు కార్మికులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.  అగ్నిమాపక, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాణసంచా కేంద్రంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. బాణసంచా కేంద్రం వద్ద మంటల ధాటికి పలు వాహనాలు దగ్ధమయ్యాయి. బాణసంచా కేంద్రం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. పేలుడు శబ్ధం వినగానే స్థానికులు, కార్మికులు ప్రాణభయంతో పరుగులు పెట్టారని పోలీసులు తెలిపారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది.