05-02-2026 03:39:43 PM
- ఒక ఫోన్ కాల్.. ఒక మెసేజ్ చాలు...
- భయం వీడండి.. ఫిర్యాదు చేయండి…
- సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల,(విజయక్రాంతి): మహిళలు ఇబ్బంది సమయంలో ఒక ఫోన్ కాల్ చేయండి… లేదా ఒక మెసేజ్ పంపండి... మీకు అండగా షీ టీమ్స్ అందుబాటులోకి వస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గురు వారం వెల్లడించారు. మహిళలు, యువతులు, బాలికలు భయం వీడి ధైర్యంగా ఫిర్యాదు చేయాలని, మీ భద్రతకు భరోసాగా షీ టీమ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో మహిళలు, బాలికల భద్రత కోసం షీటీమ్స్ నిరంతరంగా సేవలు అందిస్తున్నాయన్నారు. పోలీస్ శాఖపై, షీ టీమ్స్‌పై నమ్మకం, భరోసాతో మహిళలు, బాలికలు తమపై జరుగుతున్న వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందన్నారు.
రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ పరిధిలో రెండు షీ టీమ్స్, పెద్దపల్లి జోన్‌లో ఒక షీ టీమ్ పని చేస్తుందని సీపీ తెలిపారు. ధైర్యంగా తమను (షీ టీమ్ వాట్సాప్ నంబర్: 6303923700, పెద్దపల్లి జోన్ షీ టీమ్: 8712659386, మంచిర్యాల జోన్ షీ టీమ్: 8712659385) సంప్రదించాలని సూచించారు. డయల్ 100కు కాల్ చేసినా సహాయం అందుతుందన్నారు. సురక్షిత ప్రయాణం కోసం T-SAFE (ట్రావెల్ సేఫ్) యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు.
జనవరిలో 56 ఫిర్యాదులు...
జనవరిలో షీ టీమ్స్‌కు 56 ఫిర్యాదులు అందాయని సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. వాటిలో 13 ఫిర్యాదులు రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్, డయల్ 100, ప్రత్యక్షంగా పెద్దపల్లి, మంచిర్యాల షీ టీమ్ కార్యాలయాలకు అందాయని, మరో 43 రెడ్ హ్యాండెడ్ కేసులు డీకాయ్ ఆపరేషన్లలో నమోదు అయ్యాయన్నారు. 13 ఫిర్యాదులలో ఒకటి ఎఫ్‌ఐఆర్, ఎనిమిది పెటీ కేసులు నమోదు చేశామని, నాలుగు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించామన్నారు.
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని ప్రజా ప్రదేశాలు, పార్కులు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో షీ టీమ్స్ డీకాయ్ ఆపరేషన్లు నిర్వహించి 43 మందిని పట్టుకున్నామని సీపీ వివరించారు. వీటిలో రెండు పెటీ కేసులు నమోదు చేసి, 35 మందికి కౌన్సిలింగ్, మరో ఆరుగురిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరించామన్నారు. అలాగే 224 (మంచిర్యాల జిల్లాలో 129, పెద్దపల్లి జిల్లాలో 95) హాట్‌స్పాట్ తనిఖీలు చేశామన్నారు.