10 April, 2026 | 1:54 AM

ధాన్యం కొనుగోలు రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి

10-04-2026 12:03 AM

అదనపు కలెక్టర్ సీతా రామారావు

సూర్యాపేట ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ కె.సీతారామరావు అన్నారు.గురువారం చివ్వేంల మండలంలోని రాంకోటి తండా, సూర్యాపేట మండలంలోని రాయినిగూడెంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని అధికారులను సూచించారు. ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉన్న క్రమంలో ధాన్యం తేమ శాతం లో ఎలాంటి ఇబ్బంది లేదని, అలాగే తాలు, తరుగు సమస్య కూడా లేనందున కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేయాలన్నారు.

హమాలీల సమస్య లేకుండా చూసుకోవాలన్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఓపిఎంఎస్లో నమోదు చేసి ఆలస్యం లేకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులను కల్పించాలన్నారు. తేమ శాతం కొలిచే పరికరాలు, బరువు చూసే యంత్రాలను సక్రమంగా పని చేసేలా చూసుకోవాలన్నారు. ఆయన వెంట చివ్వెంల తాసిల్దార్ చంద్రశేఖర్, సూర్యాపేట తహసిల్దార్ కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి తదితరులు ఉన్నారు.