ఇండోనేషియాలో భూకంపం
- రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రత
- 38 మంది మృతి, పలువురికి గాయాలు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
జకార్తా, ఆగస్టు 15: ఇండోనేషియాలోని టెర్నాటే నగరం, ఫ్లోరెస్ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. 7.7 తీవ్రతతో శనివారం సంభవించిన ఈ భూకంపానికి పలు భవనాలు దెబ్బతిన్నాయి. 38 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నారని, పలువురికి గాయాలయ్యాయని, సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేసినా, అనంతరం దాన్ని ఉపసంహరించుకున్నారు.
భూకంపం అనంతరం మళ్లీ ప్రకంపనలు చోటు చేసుకోవచ్చని ప్రజలు భవనాల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. నగాయెకో ప్రాంతంలో సముద్రపు నీరు వెనక్కి తగ్గడంతో ప్రజలు భయంతో ఆ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో, వార్తా మాధ్యమాల్లో భవనాలు కూలిపోతున్న దృశ్యాలు తీవ్ర అలజడి రేపుతున్నాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించగా దీని కేంద్రం ఎండే నగరం నుంచి సముద్రంలో 68 కిలోమీటర్ల దూరంలో 10 కి.మీ. లోతులో కేంద్రం గుర్తించారు. కాగా మధ్యాహ్నం వరకు 10 నుంచి 12 వరకు ప్రకంపనలు చోటు చేసుకోగా 7.7 తీవ్రత మొదటిది. అనంతరం 6.1 తీవ్రతతో నమోదైంది.
మిగతా ప్రకంపనలు స్వల్ప తీవ్రతతో చోటు చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం 54 ఇళ్లు, ఐదు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, మూడు ప్రార్థనా స్థలాలు, ఆరు ప్రభుత్వ భవనాలు, ఒక విద్యా సంస్థ, ఒక గిడ్డంగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇండోనేషియా 17,500 ద్వీపాల సమూహం. ఇవి పసిఫిక్ మహాసముద్రంలో ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలువబడే ప్రాంతంలో ఉండడంతో తరచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయని శాస్త్రవేత్తలు ఇదివరకే పలుమార్లు ప్రకటించారు.






