18 May, 2026 | 1:26 AM

పద్మావతి- 2 కాలనీలో డ్రైనేజీ సమస్య తీవ్రం

18-05-2026 12:18 AM

మురుగునీటితో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు

మొయినాబాద్, మే 17 (విజయ క్రాంతి): మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు పద్మావతి-2 కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో సరైన డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ దుర్వాసన వెదజల్లుతోంది. మురుగునీరు ఇండ్ల మధ్య నిల్వ ఉండటంతో దోమలు, ఈగలు పెరిగిపోతున్నాయని, చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి నెలకొందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పన్నులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ మౌలిక వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని స్థానికులు తెలిపారు. వెంటనే డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు.