తల్లికి తగ్గ తనయ అనిపించుకునేనా..?!
సుమారు తొమ్మిదేళ్ల క్రితం విడుదలైంది ‘మామ్’ చిత్రం. దివంగత తార శ్రీదేవి కథానాయికగా నటించిన ఆ సినిమా బాలీవుడ్‌లో ఓ భావోద్వేగ ప్రధాన చిత్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. శ్రీదేవి.. తన కెరీర్‌లోకెల్లా అత్యంత నటనా కౌశలాన్ని కనబర్చారంటూ ఆమెపై అప్పట్లో ప్రశంసల జల్లు కురిసింది.
ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ వస్తోంది. ‘మామ్ 2’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే పట్టాలెక్కడంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్‌పైకి మళ్లింది. అయితే, ‘మామ్2’లో మెయిన్ లీడ్‌ను శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ పోషిస్తోంది. ఇది ఆమెకు అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా భావిస్తున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఎందుకంటే, ఖుషీ కపూర్ గత సినిమా ‘లవ్ యాపా’ విడుదలైనప్పుడు, అందులో ఆమె నటనపై విమర్శలు వెల్లువెత్తాయి. స్క్రీన్ ప్రెజెన్స్, హావభావాలు పలికించే విధానం చాలా మెరుగు పడాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో భావోద్వేగంతోపాటు బలమైన న్యాయపరమైన కథనం ఉండే ఈ ‘మామ్2’లో ఆమె పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకోగలదా..? అన్నది అంతటా ఆసక్తికరంగా మారింది.
ఇదే సమయంలో నిర్మాతగా బోనీ కపూర్ తీసుకున్న నిర్ణయం కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. తన భార్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమాకు సీక్వెల్ రూపొందించడం ఒకవైపు భావోద్వేగపూరిత నిర్ణయమైతే, మరోవైపు వ్యూహాత్మక అడుగుగా కూడా చూడవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే ‘మామ్’ బ్రాండ్‌కు ఉన్న భావోద్వేగ విలువలను కొనసాగిస్తూ, ఈ తరం హీరోయిన్‌తో ఫ్రాంచైజ్‌ను విస్తరించాలనే ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం సీక్వెల్ మాత్రమే కాదు, ఒక లెగసీని కొత్త దిశలో నడిపించే ప్రయత్నమని ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ తరుణంలో ఖుషీ కపూర్ తనదైన ప్రదర్శన ఇవ్వటం ద్వారా తల్లికి తగ్గ తనయ అనిపించుకోవాల్సి ఉంటుంది.




