శిక్షణ తరగతులు సరే.. ప్రధానమంత్రి మోదీ ఫొటో ఏదీ?
బీజేసీ పార్లమెంట్ కన్వీనర్, 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ధ్వజం
కరీంనగర్ క్రైం, మార్చి12(విజయక్రాంతి): ప్రజా పాలన. ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణా తరగతుల్లో బిజెపి పార్లమెంట్ కన్వీనర్, 50వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అధికారుల తీరుపై తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు.
నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు శిక్షణ తరగతుల సందర్భంగా ఏ ర్పాటుచేసిన ఫ్లెక్సీలో కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోను పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోది ఫోటో పెట్టకపోవడంపై అధికారుల తీరును ప్రవీణ్ రావు తప్పు పట్టి మాట్లాడారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అధిక శాతంలో నిధులు అందిస్తుందని, స్మార్ట్ సిటీ కోసం వందల కోట్లు నిధులు అందించింది కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వమేనన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు, అభివృద్ధి కోసం నిధులు నగర పాలక సంస్థకు అవసరమైనప్పుడు కేవలం ముఖ్యమంత్రి ఫోటో పెట్టి, ప్రధానమంత్రి ఫోటో పెట్టకపోవడం సరికాదన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో బిజెపి అధికారంలో ఉందని, దేశ ప్రధాని మోదీ ఫోటో కచ్చితంగా ఉండేవిధంగా అధికారులు ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరారు.




