ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి
గుండాల,విజయక్రాంతి: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డా. తుకారాం రాథోడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు మరియు అన్ని రికార్డులను ఆయన పరిశీలించారు. ఎన్హెచ్ఎం ద్వారా నిర్వహించే ఆరు కార్యక్రమాలపై మండల గిరిజన ప్రజలకు సిబ్బంది అందించే పనితీరును ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలోని లాబ్, వార్డు, ఫార్మసీ, కాన్పు గది అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి మండల వైద్యాధికారికి, సిబ్బందికి తగు సూచనలు, సలహాలను ఇచ్చారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది రాకుండా ఫీల్డ్ సిబ్బంది గ్రామాల్లో దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు రాకుండా ఫ్రైడే- డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. మండల ప్రజలు మహిళా డాక్టర్ కావాలనే డిమాండ్ మేరకు స్థానిక శాసనసభ్యులకు విషయం తెలపడంతో ఆసుపత్రిలో ప్రతీ మంగళవారం మహిళా డాక్టరు వచ్చే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ & డీఐవో డా. ప్రతాప్, డా. రామ్ నాయక్ , డా. రిషిత, హెచ్ఈవో రాంప్రసాద్, సూపర్వైజర్ రాజు, భూ లక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






