18 May, 2026 | 2:49 AM

24న రాష్ట్ర సాధన ఉద్యమకారుల జిల్లా స్థాయి సమావేశం

18-05-2026 01:54 AM

సిద్దిపేట క్రైం, మే 17: ఈ నెల 24 న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కారుల జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తామని ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా ఉద్యమకారులను ఏకం చేసి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కారుల సంఘం నిర్ణయించింది.

ఆదివారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో సంఘం ప్రతినిధుల సమావేశం జరిగింది. సమావేశంలో టీజేఏసీ అధ్యక్షులు జి.పాపయ్య, టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జి.తిరుపతి రెడ్డి, టీపీఎఫ్ అధ్యక్షుడు జి.సత్తయ్య,తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రంగాచార్య, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు పి.శంకర్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం ప్రతినిధులు, న్యాయవాదులు కర్రోళ్ల బాబు, ఖమ్మంపల్లి యాదగిరి, జి.రమేష్, పి.శ్రీకాంత్, సీహెచ్.చిరంజీవి తదితరులు పాల్గొని మాట్లాడారు.

సిద్దిపేట కేంద్రంగా ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తమ విలువైన సమయాన్ని జీవితాన్ని ధారపోశారని తెలిపారు. ఉద్యమ కారులకు సరైన  గుర్తింపు  రావాల్సిన అవసరం ఉందన్నారు. వారందరితో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుల సంఘం ఏర్పాటు  చేసినట్టు తెలిపారు. సంఘం విస్తృత స్థాయి సమావేశం ఈనెల 24 న సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో  నిర్వహిస్తామని తెలిపారు. ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.