24 April, 2026 | 1:52 AM

ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో డయాలసిస్ సేవలు

24-04-2026 12:19 AM

డీఎంహెచ్‌ఓ డాక్టర్ లలితాదేవి

ఆమనగల్లు, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ఆమనగల్లు ప్రాంత ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలోనే ఐదు పడకల డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి రానున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి(డీఎంహెచ్‌ఓ) డాక్టర్ లలితాదేవి వెల్లడించారు.గురువారం ఆమె నిర్మాణంలో ఉన్న ఆమనగల్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) నూతన భవనాన్ని సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతన భవనం ప్రారంభమైన వెంటనే అందులో డయాలసిస్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.ఇప్పటివరకు డయాలసిస్ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్న

ఈ ప్రాంత రోగులకు స్థానికంగానే చికిత్స అందనుంది.నూతన సీహెచ్సీ భవనంలో అత్యాధునిక వసతులతో కూడిన ఐదు పడకలను ఈ కేంద్రం కోసం కేటాయించినట్లు తెలిపారు. భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మహేశ్వరం హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేందర్, ఆమనగల్లు సిహెచ్సి సూపరింటెండెంట్ నాగరాజు, వైద్యాధికారి మైమున, హెచ్‌ఈఓ తిరుపతి రెడ్డి, నర్సింగ్ ఆఫీసర్ హెక్సిబా, సునీత, అలివేలు, టీబీ విజయ్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ వేణు పాల్గొన్నారు.