6 March, 2026 | 6:38 PM

లోక్యతండాలో ఆకట్టుకున్న ‘ఢూండ్’

05-03-2026 12:00 AM

తెల్లవారుజామున కామదహనం.. వేలాధిగా తరలివచ్చిన గిరిజనం

20మంది మగబిడ్డలకు  నామకరణం చేసిన కులపెద్దలు

ఆటపాటలతో సందడి చేసిన యువత

అంబరాన్నంటిన రెండవ రోజు హోలీ సంబరాలు

హాజరైన బంజార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజుకుమార్

కూసుమంచి, మార్చి 4 (విజయకాంత్రి): కూసుమంచి మండలంలోని లోక్యతండాలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి.. మొదటి రోజు కోలాటం కార్యక్రమంతో వేడుకలను ప్రారంభించిన తండావాసులు రెండవ రోజు బుధవారం కామదహనం, ఢూండ్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. గిరిజన సంస్కతి, సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా హోలీ ఉత్సవాలను బంజారులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 

వేలాది మంది సమక్షంలో కామదాహనం

హోలీ వేడుకల్లో భాగంగా రెండవ రోజు తెల్లవారుజామున కామున్ని దహనం చేసే కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించారు. తెల్లవారుజామున 3గంటల నుంచి ఉదయం 8గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. తండాలోని ప్రతి ఇంటికో కట్టే చొప్పున తీసుకొచ్చి ఒక కుప్పగా చేర్చి నిప్పంటిస్తారు. కుల పెద్ద గేరియా, ఖారోబారో, సర్పంచ్ వెంకటేష్, గ్రామ పెద్దలు డప్పులతో కామదహనం స్థలం వద్దకు చేరుకుని ప్రత్యేక గిరిజన సంప్రధాయ ప్రకారం పూజలు చేశారు.

అనంతరం కామదహనం చేసి, ఆ మంటల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. యువకులు, మగవారు పాటలు పాడుతూ చెర్రా అంటూ పెద్దపెద్ద శబ్ధాలు చేస్తూ సందడి చేశారు. మంటలు చల్లారే వరకు గుండం చుట్టూ తిరిగి కామునికి నమస్కరించి తిరిగి వెళ్లిపోయారు. పెళ్లీడుకు వచ్చిన యువత, కొత్తగా పెళ్లి చేసుకున్నయువత కుల పెద్దల ఆశీర్వాదం పొందారు. మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లులు, చిన్నారులు, కుటుంబ సభ్యులు కాముడికి పూజలు చేశారు. చల్లగా చూడాలని కోరుకున్నారు. 

బావమరదళ్ల సందడి

బావమరదళ్ల వరసకు ప్రతీకగా పిలవబడే ఈ కార్యక్రమంలో భాగంగా బావమరదళ్లు, వరసయ్యే వారి నడుమ సరదా సంభాషణ నడిసింది. బావ, మావ వరసయ్యే యువకులు మరదళ్లను ఆటపట్టించేందుకు ప్రయత్నాలు చేస్తూ గిరిజన సంస్కతి సంప్రధాయం  ఉట్టిపడే విధంగా యువకులు సంబరాలు చేసుకున్నారు. వందలాధి మంది యువకులు ‘చర్రా’ అంటూ గిరిజన పాటలతో కేరింతలు కొడుతూ సందడి చేశారు. 

రెండు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన గిరిజనులు

లోక్యతండాలో జరుగుతున్న హోలీ సంబరాలకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాధి మంది గిరిజనులు తరలివచ్చి వేడుకలను తిలకించారు. ఖమ్మం, వరంగల్, సూర్యపేట, మహుబూబాబాద్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రంలోని క్రిష్ణా, గుంటూరు, ప్రకాశం , కడప, కర్నూలు నుంచి గిరిజనులు లోక్యతండాకు బందువుల ఇండ్లకు వచ్చి వేడుకలను తిలకించారు.

అలాగే బంజార సంఘం (లైవ్) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్, రాష్ట్ర నాయకులు బిక్షపతి, పాలేరు డివిజన్ అధ్యక్షుడు వడ్తియా శోభన్ ఈ వేడుకలకు హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన సంప్రధాయాలను 100ఏళ్ల నుంచి కొనసాగిస్తున్న లోక్యతండా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. లంబాడి సోదరులందరు అన్ని రంగాల్లో ముందుండాలని, అందరికి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. 

ఆకట్టుకున్న ‘ఢూండ్’ కార్యక్రమం

లోక్యతండాలో హోలీ వేడుకల్లో భాగంగా రెండవ రోజు మధ్యాహ్నం ‘ఢూండ్’ కార్యక్రమం అకట్టుకుంది. గత హోలీ నుంచి ఇప్పటి హోలీవరకు ఆ తండాలో మగబిడ్డలకు జన్మనిచ్చిన ఇంట్లో ‘ఢూండ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. కుల పెద్దలు గేరియా, ఖారోబారోలు, గ్రామ పెద్దలు డప్పులతో ఆ ఇండ్లకు చేరుకుని ఢూండ్ నిర్వహించారు. కర్రలతో కోలాట కార్యక్రమం నిర్వహించి గిరిజన సంస్కతి సంప్రధాయ ప్రకారం పాటలు పాడారు.

అనంతరం మగబిడ్డలకు నామకరణం చేసి, అన్నప్రసాదాన్నిఅందించి. మహిళలు  చప్పట్లు కొడుతూ పాటలు పాడారు. సుమారు 20 మంది మగబిడ్డలకు నామకరణాలు చేసి, అన్నప్రసాదాలను అందించారు. ఈ సమయంలో యువకులు చేసే అల్లరి అంతాఇంత కాదు. దీంతో  రెండవ రోజు హోలీ వేడుకలను పూర్తి చేశారు. గురువారం మూడవ రోజు భాగంగా రంగోలీ నిర్వహించనున్నారు. గిరిజనులందరు కలిసి రంగులు పూసుకుని సందడి చేస్తారు. దీంతో మూడు రోజుల హోలీ కార్యక్రమానికి ముగింపు పలుకతారు.