21 May, 2026 | 3:49 AM

డిప్యూటీ కలెక్టర్ షర్మిలపై సస్పెన్షన్ వేటు

21-05-2026 12:00 AM
  1. ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్‌ఏ కమిషనర్
  2. విజిలెన్స్ నుంచి సీఎం ఆఫీస్ వరకు అనేక ఫిర్యాదులు 

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): డిప్యూటీ కలెక్టర్ హోదాలో చాలా కాలంగా డిప్యుటేషన్ పై హెచ్‌ఎండీఏలో విధులు నిర్వహిస్తున్న ఎం. షర్మిలపై సస్పెండ్ వేటు పడింది. ఆమె చేసిన అనేక అవినీతి, అక్రమాలపై ఆ శాఖ అధికారులతో పాటు విజిలెన్స్ మొదలుకొని సీఎం ఆఫీసు వరకు ఆమెపై బాధిత ప్రజలు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే డిప్యూటీ కలెక్టర్ ఎం.షర్మిల వ్యవహారంపై అంతర్గత విచారణ చేసిన అధికారులు ఆమెను ముందుగా అక్కడి నుంచి బదిలీ చేయాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఆమెను కొంత కాలం క్రితం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఆర్డీఓగా, అలాగే ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారిగా పోస్టింగ్ ఇస్తూ బదిలీ చేశారు. కానీ, డిప్యూటీ కలెక్టర్ ఎం.షర్మిల మాత్రం హెచ్‌ఎండీఏలో కుర్చీని మాత్రం వదలడం లేదు. ఉన్నతాధికారులు అనేక దఫాలుగా పోస్టింగ్ ఇచ్చిన స్థానానికి వెళ్లాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినా ఆమె పెడ చెవిన పెట్టారు.

దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్‌కుమార్ డిప్యూటీ కలెక్టర్ షర్మిలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ కలెక్టర్ షర్మిల బదిలీ అయిన స్థానంలో జాయిన్ కానీ కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్ ) మ్యాపింగ్‌పై ప్రభావం పడిందని, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆమె సస్పెన్షన్‌లోనే కొనసాగుతారని సీసీఎల్‌ఏ  కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షర్మిలపై సస్పెన్షన్ ఉత్తర్వులు అమలులో ఉన్న కాలంలో సీసీఎల్‌ఏ కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్ళవద్దని పేర్కొన్నారు.