14 June, 2026 | 3:01 AM

ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా?

14-06-2026 12:05 AM
  1. మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి కేసు లేదు
  2. ఆమెను అకారణంగా బలి చేశారు
  3. రాజ్యసభలో బలం పెంచుకునేందుకు బీజేపీ కుట్ర
  4. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి) : మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ తీరు చూస్తుంటే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా?, నియంత దేశంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. మీనాక్షి నటరాజన్‌కు నోటీసు మాత్రమే వచ్చిందని, ఎఫ్‌ఐఆర్ లేనప్పుడు కేసు ఎక్కడిది? అని ప్రశ్నించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ తిరస్కరించే అధికారం లేకున్నా తిరస్కరించారని, ఆర్‌ఓకు ఉరివేసిన తప్పులేదని మండిపడ్డారు.

రాజ్యసభలో బలం పెంచుకోవాలని బీజేపీ కుట్రకు పూనుకుందని ఆరోపించారు. గాంధేయవాది, నిజాయితీకి నిలువుటద్దం మీనాక్షి నటరాజన్ అని కొనియాడారు. ప్రధానమంత్రి కార్యాలయం జోక్యంతో కేసును తప్పుదోవ పట్టించారని, ప్రధాని నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగలేదరఱన్నారు.

బీజేపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని, అకారణంగా ఆమెను బలి చేశారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి మాపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. ప్రధాని ఇంతలా దిగజారి ప్రవర్తించడం సిగ్గుచేటు అని విమర్శించారు.  లీకు వీరులు, గ్రీకు వీరులు ఉంటే సీఎం సమగ్రంగా విచారిస్తున్నారని పేర్కొన్నారు. షబ్బీర్ అలీ ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని, ఆయనకు షోకాజ్ ఇచ్చామని తెలిపారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న షబ్బీర్ అలీ..  మహిళలను చులకన చేసి మాట్లాడటం విచారకరమన్నారు. ఏడాది కిందటి మాట్లాడిన ఆడియో బయటకు వచ్చిందన్నారు. నేను ఏంటో కేటీఆర్ కంటే హరీష్‌రావుకు బాగా తెలుసు అన్నారు. ఫోర్త్ సిటీని అడ్డుకుంటామని అనడం వారి మూర్ఖత్వమని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేదని,  మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.