దేశంలో 150 మిలియన్ల ఏసీల డిమాండ్
- బ్లూస్టార్ ఎండీ త్యాగరాజన్
ఏసీలను 25 డిగ్రీలకే పరిమితం చేయడం స్వాగతిస్తున్నాం
బ్లూస్టార్ వైస్ ప్రెసిడెంట్ గిరీష్ హింగొరాని
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): భారత దేశంలో ఏసీ (ఏయిర్ కూలర్)ల డిమాండ్ కీలక దశలో ఉందని, ప్రస్తుతం ఉన్న జనాభా, వినియోగదారుల ధోరణుల్లో వస్తున్న మార్పులే దీనిక ప్రధాన కారణం. భారతదేశంలో 150 మిలియన్ల ఏసీలకు డిమాండ్ ఉందని ప్రముఖ ఏసీల తయారీ సంస్థ బ్లూస్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బి.త్యాగరాజన్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని హోటల్‌లో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో.. దేశంలోని రెసిడెన్షియల్, కమర్షియల్ విభాగాల్లో ఏసీల వినియోగంలో బ్లూస్టార్ సంస్థ సరికొత్త ఏయిర్ కండిషనర్ల శ్రేణిని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన దేశంలోని ఏసీ మార్కెట్ అంశాలపై మాట్లాడారు. రకరకాల వినియోగదారుల అవసరాలు, భిన్నమైన వాతావరణాలకు అనుగుణంగా బ్లూస్టార్ కంపెనీ నుంచి సుమారు 125 మోడల్స్‌లో ఏసీలు లభిస్తాయని..
ఇవన్నీకూడా 2026 జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయని ఆయన తెలిపారు. ఇందులో 50 మోడ ల్స్‌లో స్మార్ట్ వైఫీ సదుపాయం ఉందని తెలిపారు. అత్యంత సమర్థవంతంగా కూలింగ్ కల్పిస్తూనే.. విద్యుత్తును ఆదా చేసేలా వీటిని రూపొందించినట్టు వివరించారు.
తెలంగాణ సర్కారు నిర్ణయాన్నిస్వాగతిస్తున్నాం..
ప్రభుత్వ కార్యాలయాల్లోని ఏసీలన్నీ 25 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కొనసాగాలని తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంపై ‘విజయక్రాంతి’ అడిగిన ప్రశ్నకు బ్లూస్టార్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) గిరీష్ హింగొరాని సమాధానం చెబుతూ.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. విద్యుత్తును ఆదా చేయడానికి, భూవాతావరణం వేడెక్కకుం డా ఉండటానికి ఇది చాలా మంచి నిర్ణయమని,
వాస్తవానికి మనిషి శరీరానికికూడా 25 డిగ్రీల ఉష్ణోగ్రత సరైందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయం దేశం మొత్తం తీసుకుంటే.. చాలా విలువైన విద్యుత్తు ఆదా అవుతుందని, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సమావేశంలో గ్రూప్ ప్రెసిడెంట్ మోహిత్ సూద్ తదితరులు పాల్గొన్నారు.




