తగ్గుతున్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి
ఆయా కేంద్రాల్లో పీఎల్‌ఎఫ్ గణనీయంగా తగ్గుదల
రాష్ట్రంలో సగటున 54 శాతమే పీఎల్‌ఎఫ్
యాదాద్రిలో.. 41 శాతం, సింగరేణిలో 77 శాతం
దేశంలో పీఎల్‌ఎఫ్ సగటు 66 శాతం
విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు నిల్వల కొరతే అడ్డంకి
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని రోజురోజుకూ తగ్గిస్తున్నారు. దీనితో ఆయా థర్మల్ విద్యుత్తు కేంద్రాల పీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) కూడా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా అన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాల సగటు పీఎల్‌ఎఫ్‌తో పోల్చితే.. అంతకంటే చాలా తక్కువ పీఎల్‌ఎఫ్‌తో మన థర్మల్ విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల సగటు పీఎల్‌ఎఫ్ 66 శాతం ఉండగా.. అది తెలంగాణలో (తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో) కేవలం 54 శాతం ఉండడం గమనార్హం.
డిమాండ్ పెరుగుతున్నా.. తగ్గుతున్న పీఎల్‌ఎఫ్
సంవత్సరాలుగా పరిశీలిస్తే.. తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అందుకు అనుగుణంగానే విద్యుత్ ఉత్పత్తిని పెంచాల్సి వస్తోంది. పెంచాలి కూడా. అయితే రాష్ట్ర జెన్‌కో ఆధ్వర్యంలో నడిపిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల విషయానికి వచ్చేసరికి ఎందుకనో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)ను పెంచకుండా.. అంటే పూర్తి సామర్థ్యంతో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పనిచేయకుండా తక్కువ సామర్థ్యంతో తక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడాన్ని ఉద్యోగులు, కార్మిక సంఘాలు కూడా ఎత్తిచూపుతున్నాయి.
దేశంలోని ఆయా రాష్ట్రాల జెన్‌కోల పరిధిలో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల సగటు పీఎల్‌ఎఫ్ 66 శాతంగా ఉండగా.. అది తెలంగాణలో కేవలం 54 శాతంగా ఉండటం గమనార్హం. ఇందులో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మాత్రం 77 శాతం పీఎల్‌ఎఫ్‌తో నడుస్తోంది. అలాగే భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం 69 శాతం, కొత్తగూడెంలోని కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రం 70 శాతం పీఎల్‌ఎఫ్‌తో నడుస్తోంది. మిగతావన్నీ జాతీయ సగటు (66 శాతం) కన్నా తక్కువ పీఎల్‌ఎఫ్‌తోనే ఉత్పత్తి చేస్తున్నాయి.
బొగ్గు కొరతే ప్రధాన కారణం
గడిచిన కొద్ది కాలంగా తెలంగాణలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా తగ్గుతూ వస్తోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ప్రమాణాలు, నిబంధనల ప్రకారం ప్రతి థర్మల్ విద్యుత్ కేంద్రంలో కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. అయితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఆ స్థాయిలో బొగ్గు నిల్వలు ఉండటం లేదు. దీనితోనే పీఎల్‌ఎఫ్‌ను తగ్గించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టుగా నిపుణులు అనుమానిస్తున్నారు.
సీఈఏ నిబంధనల ప్రకారం తెలంగాణలో జెన్‌కో ఆధ్వర్యంలోని కేంద్రాలకు 21 రోజులకు సరిపడా బొగ్గు కావాలంటే.. 20.63 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ మంగళవారం (118.2026) నాటికి పరిశీలిస్తే.. కేవలం 5.15 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారణంగానే తక్కువ పీఎల్‌ఎఫ్‌తో థర్మల్ విద్యుత్ కేంద్రాలను నడిపిస్తున్నారనే విమర్శలు వినపడుతున్నాయి.
ఎన్టీపీసీ ఆధ్వర్యంలోనూ..
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో నడుస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల విషయానికి వచ్చేసరికి జాతీయ సగటు పీఎల్‌ఎఫ్ కన్నా ఎక్కువ సామర్థ్యంతోనే నడవడం గమనార్హం. రామగుండంలోని ఎన్టీపీసీ ప్లాంట్ 66 శాతం పీఎల్‌ఎఫ్‌తో నడుస్తుండగా.. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించిన 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రం మాత్రం 80 శాతం పీఎల్‌ఎఫ్‌తో నడుస్తోంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో మాత్రం జాతీయ సగటు పీఎల్‌ఎఫ్ కంటే ఎక్కువ స్థాయిలో ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్రాల్లో అతి తక్కువ పీఎల్‌ఎఫ్‌తో నడిపిస్తున్నారని అర్థమవుతోంది.
నిరాశాజనకంగా.. యాదాద్రి
రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో నడుస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని పరిశీలిస్తే.. అన్నింటికంటే అతి తక్కువగా యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రమే నిలుస్తోంది. మొత్తం 3200 మెగావాట్ల సామర్థ్యంతో (4 యూనిట్లు) ఉన్న ఈ కేంద్రంలో కేవలం 41 శాతం పీఎల్‌ఎఫ్‌తోనే మమ అనిపిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. అతి తక్కువ బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండటమే. 9.18 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు అవసరం ఉండగా.. కేవలం 1.26 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది.
ఈనెల 11 తారీఖునాటి అధికారిక గణాంకాల (సీఈఏ వెబ్‌సైట్‌లో పొందుపర్చినవి) ప్రకారం.. ప్రతిరోజూ 43.7 వేల టన్నుల బొగ్గు (80 శాతం పీఎల్‌ఎఫ్) అవసరం కాగా.. ఇప్పుడు ఉన్నది మాత్రం 1.26 లక్షల టన్నులే. మంగళవారం 27.9 వేల టన్నుల బొగ్గు సరఫరా అవ్వగా.. 31.1 వేల టన్నుల బొగ్గును ఉపయోగించారు. అంటే ప్రతిరోజూ కావాల్సినంత కూడా బొగ్గు సరఫరా అవ్వడం లేదని అర్థమవుతోంది.
విద్యుత్తు కేంద్రం సామర్థ్యం పీఎల్‌ఎఫ్
(మెగావాట్లలో) శాతం
సింగరేణి థర్మల్ ప్లాంట్ 1200 77
భద్రాద్రి థర్మల్ ప్లాంట్ 1080 64
కాకతీయ థర్మల్ ప్లాంట్ 1100 69
కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ (కొత్తది) 1000 70
కొత్తగూడెం థర్మల్ ప్లాట్ (స్టేజ్ 800 54
యాదాద్రి థర్మల్ ప్లాంట్ 3200 41
మొత్తం (తెలంగాణ జెన్‌కో పరిధి) 7180 54






