వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోండి: డిడి జాదవ్ అంబాజీ
ఉట్నూర్,(విజయక్రాంతి): గిరిజన విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసి వారిని సాన పెట్టేందుకు గిరిజన సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ అన్నారు. శనివారం ఉట్నూర్ కేబి కాంప్లెక్స్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
వేసవి సెలవులలో తమ సమయాన్ని వృధా చేసుకోకుండా క్రీడలు కలలు కంప్యూటర్ కుట్లు అల్లికలు టైలరింగ్ చిత్రలేఖనం లాంటి ఎన్నో అంశాలను నేర్చుకునే అవకాశం విద్యార్థులకు దక్కిందన్నారు, భవిష్యత్తులో ఉపాధికి సైతం ఎన్నో అవకాశాలు లభిస్తాయని చెప్పారు, పిల్లలు ఇంటిని మరిచేలా అనేక కార్యక్రమాలు ఉంటాయని ఆటపాటలతో సేద తీరాలని కోరారు.
డిప్యూటీ డిఈఓ గోడం చందన్, ఏపీఓ పీవీటీజీ ఆత్రం భాస్కర్ లు మాట్లాడుతూ... 15 రోజులపాటు జరిగే శిబిరాలలో చివరి వరకు ఉండి అన్ని అంశాల్లో ప్రావీణ్యం సాధించాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున బయట తిరగొద్దని సూచించారు. పాము పాఠశాలలకు వచ్చినప్పుడు శిబిరాల్లో నేర్చుకున్న విషయాలను గురించి అడుగుతామని చెప్పారు, అనంతరం క్రీడా పరికరాలను పంపిణీ చేశారు.






