వార్షికోత్సవం సందర్భంగా దేవి పుత్రిక కార్యక్రమం
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): రోహన్ హాస్పిటల్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్ స్థాపించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పత్రికా సమావేశం నిర్వహించి “దేవి పుత్రిక” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి ఎ. నీరజ ప్రారంభించగా, గౌరవ అతిథిగా డా. బి.ఎన్. రావు హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డా. బి.ఎన్. రావు పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా డా. ఎనమల్ల శ్రీదేవి, డా. ఎనమల్ల నరేష్ మాట్లాడుతూ.... గత 24 సంవత్సరాలుగా తమపై నమ్మకం ఉంచి ఆదరిస్తున్న రోగులు, శ్రేయోభిలాషులకు సమాజానికి ఉపయోగపడే సేవ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆడపిల్లలు చదువు, ఉద్యోగం, క్రీడలు వంటి రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు సాగుతున్నప్పటికీ, ఆడపిల్ల పుట్టినప్పుడు అసంతృప్తి వ్యక్తం చేసే భావజాలం ఇంకా సమాజంలో ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి, ఆడపిల్లల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి “దేవి పుత్రిక” కార్యక్రమం తోడ్పడుతుందని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన బాలికల రక్షణ కార్యక్రమాల నుండి ప్రేరణ పొంది, తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.






