మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు
దమ్మపేట, మే 23(విజయక్రాంతి): దమ్మపేట లో నిప్పుల కొలిమిలా ఎండలు మండుతున్నాయి. దమ్మపేట పరిధిలో భానుడు భగభగలాడుతున్నాడు. మే నెల ప్రచండ భానుడి తాపానికి మండల వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుత వాతావరణ వివరాల ప్రకారం దమ్మపేట లో శుక్ర, శనివారాల్లో 44 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ సూచీలు సూచిస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశంతో ఎండలు ఇంకా మండే అవకాశం వుండడంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. రెండు రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగి 45 డిగ్రీలు దాటే అవకాశం వుండడంతో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం వుండడంతో ప్రభుత్వం ఇప్పటికే అత్యవసమైతే తప్ప ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు బయటకు రావద్దని హెచ్చరిస్తుంది. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రత లు 35 డిగ్రీలు గా ఉండడంతో ఉక్కపోత ఎక్కువగా ఉంటోందని ప్రజలు వాపోతున్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు పై బడడంతో దాహం వేయకపోనినప్పటికీ 30 నిమిషాలకు ఒకసారి మంచి నీరు సేవించి శరీరం హైడ్రేట్ గా ఉంచుకోవాలని, మజ్జిగ, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకుని సేవించాలని వైద్యులు సూచిస్తున్నారు.
బయటకు వెళ్లేటప్పుడు కాటన్ దుస్తులు ధరించడం, తలకు టోపీ, రుమాలు లేదా గొడుగు ఉపయోగించాలని, వృద్ధులు, పిల్లలు చల్లటి ప్రదేశంలో ఫ్యాన్, లేదా చల్లటి ప్రదేశంలో సేద తీరాలని, 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటితే ఫ్యాన్ గాలి కూడా వేడి గాలులు వచ్చే అవకాశం వుండడంతో తప్పనిసరిగా కూలర్ లు వాడాలని వైద్యులు తెలుపుతున్నారు. ఎండ తీవ్రతకు చిన్నపిల్లలు, వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మండల ప్రజలందరూ ఈ వడగాల్పుల తీవ్రతను గమనించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులు కోరుతున్నారు.






