25 April, 2026 | 1:46 AM

కొత్త డీజీపీగా సీవీ ఆనంద్?

25-04-2026 12:10 AM
  1. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శిఖా గోయల్
  2. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా తరుణ్ జోషి
  3. ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ
  4. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ రామకృష్ణారావు

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): రాష్ట్ర పోలీస్ శాఖలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీచేసింది. ఈ మేరకు సీఎస్ కే రామకృష్ణారావు పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీచేస్తూ శుక్ర వారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి పదవీ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ను నియమించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

మే నెల మొదటివారంలో సీవీ ఆనందర్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీచేసింది. 1994 బ్యాచ్‌కు చెందిన శిఖాగోయల్ ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్ డీజీగా విధులు నిర్వర్తిస్తుండగా హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీచేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ డైరెక్టర్‌గా అదన పు బాధ్యతల్లో కూడా కొనసాగుతారు.

ఏడీజీ (పర్సనల్)గా ఉన్న దేవేంద్రసింగ్ చౌహాన్ (1997)ను డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్ ఎన్ఫోర్స్‌మెంట్)గా బదిలీ అయ్యారు. ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న తరుణ్ జోషిని అత్యంత కీలకమైన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుత సీపీ సుధీర్‌బాబు పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో ఈ నియామకం చేపట్టారు. మల్కాజిగిరి సీపీగా ఉన్న అవినాష్ మొహంతిని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా బదిలీచేశారు.

ఆయనకు ఏసీబీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐజీ (ఎస్‌ఐబీ)గా ఉన్న సుమతిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా నియమించారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీగా ఉన్న షా నవాజ్ ఖాసీంను మల్టీ జోన్ ఐజీపీగా బదిలీచేశారు. ఐజీపీ (ఇంటెలిజెన్స్)గా ఉన్న కార్తికేయకు ఐజీపీ (ఎస్‌ఐబీ)గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

రాష్ట్రంలో పాలనను మరింత వేగవంతం చేయడానికి, ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల భద్రతను పర్యవేక్షించడానికి అనుభవజ్ఞులైన అధికారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా హోం శాఖలో శిఖాగోయల్ నియామకం, ఫ్యూచర్ సిటీకి తరుణ్ జోషి ఎంపిక వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మే 1 నుంచి ఈ బదిలీలు అమలులోకి రానున్నాయి.