జీవో 111కు మంగళం!
- మొయినాబాద్‌లో ‘అధికారుల మౌనం.. అక్రమార్కుల సామ్రాజ్యం’!
- రెండంతస్తుల పర్మిషన్‌తో ఏడు ఫ్లోర్లు..
- గండిపేటను మింగేస్తున్న మురుగు నోరు
- కళ్ల ముందే అక్రమ కట్టడాల జాతర..
- టౌన్ ప్లానింగ్ నిద్ర నటిస్తోందా?
మొయినాబాద్, జులై 19(విజయక్రాంతి): హైదరాబాద్ నగరానికి తాగునీరందించే జంట జలాశయాల రక్షణ కోసం తీసుకొచ్చిన చారిత్రాత్మక ‘జీవో 111’ ఇప్పుడు మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిలువునా ఖూనీ అవుతోంది. కొందరు రియల్టర్లు, భవన యజమానులు చట్టాలను చేతుల్లోకి తీసుకుని కాసుల వేటలో పడ్డారు.
చిలుకూరు డైమండ్ సిటీ వెంచర్, అజీజ్నగర్, హిమాయత్నగర్ ప్రాంతాల్లో పర్యావరణ నియమాలను పూర్తిగా బేఖాతరు చేస్తూ కాంక్రీట్ వనాలను లేపుతున్నారు. ఈ దందా అంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా, వారు ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరించడం వెనుక ఉన్న ‘అసలు రహస్యం’ ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
నిబంధనలు తుంగలోకి.. 7 అంతస్తుల ‘అక్రమ’ సౌధాలు..
పర్యావరణ సమతుల్యత దెబ్బతినకూడదనే ఉద్దేశంతో జీవో 111 పరిధిలో కేవలం జీ ప్లస్-2 (G+2) అంతస్తుల వరకే అనుమతులు ఇస్తారు. కానీ మొయినాబాద్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. నిబంధనల బోర్డులను పక్కనబెట్టి ఏకంగా 5 నుండి 7 అంతస్తుల మేర బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక భారీ స్థాయిలో చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం.. ‘హాస్టల్’ మాఫియా..
చుట్టుపక్కల ఉన్న ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ కాలేజీలే పెట్టుబడిగా ఇక్కడ ప్రైవేట్ హాస్టళ్ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. మున్సిపాలిటీ వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేని 25కు పైగా ప్రైవేట్ హాస్టళ్లు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుండి నెలకు రూ. 8,000 నుండి రూ. 10,000 వరకు దండుకుంటూ, వందలాది మందిని గొర్రెల మందల్లా ఉంచుతున్నారు.
కమర్షియల్ విధివిధానాలు లేని ఈ భవనాల్లో కనీస ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక ఏర్పాట్లు) కానీ, భవన భద్రతా ప్రమాణాలు కానీ లేవు. ప్రమాదవశాత్తు ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే వందలాది మంది విద్యార్థుల ప్రాణాలు ఏం కావాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారినా పట్టించుకునే నాథుడే లేడు.
గండిపేటకు ‘మురుగు’ ముప్పు
ఈ అక్రమ హాస్టళ్ల నుండి వెలువడుతున్న మురుగునీరు, కాలుష్య వ్యర్థాలు నేరుగా గండిపేట (ఉస్మాన్ సాగర్) పరివాహక ప్రాంతాల్లోకి చేరుతున్నాయి. నిబంధనల ప్రకారం మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, నిర్వాహకులు పైసా ఖర్చు పెట్టకుండా పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. దీంతో చారిత్రాత్మక జలాశయం కలుషితమవడమే కాకుండా, స్థానిక భూగర్భ జలాలు పూర్తిగా విషతుల్యంగా మారుతున్నాయి.
కళ్లముందే కొండల్లా అక్రమ నిర్మాణాలు లేస్తుంటే.. ‘ఫిర్యాదులు వస్తేనే చర్యలు తీసుకుంటాం’ అని కమిషనర్ అనడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. అధికారులు తక్షణమే స్పందించి సుమోటోగా (స్వచ్ఛందంగా) విచారణ చేపట్టాలి.నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే, భవన కూల్చివేతలు తథ్యం కానున్నాయి.
మాకు రాతపూర్వక ఫిర్యాదు కావాలి
ఈ అక్రమ నిర్మాణాలపై మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ను వివరణ కోరగా.. మున్సిపాలిటీ పరిధిలో ప్రైవేట్ హాస్టళ్లు నడుస్తున్న మాట వాస్తవమేనన్నారు. అయితే, పారిశుద్ధ్యం లేదా మురుగునీటి సమస్యలపై స్థానికుల నుండి తమకు రాతపూర్వక ఫిర్యాదులు అందితేనే చట్టప్రకారం పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం.
- మున్సిపల్ కమిషనర్
జాకీర్ అహ్మద్






