డీఅడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన సీపీ
మంచిర్యాల, జూన్ 5 (విజయక్రాంతి): గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలై మంచిర్యాలలోని డి-అడిక్షన్ కేంద్రంలో చికిత్స పొందుతున్న వ్యక్తులను రామగుండం పోలీస్ కమిషనర్ (సీపీ) అంబర్ కిషోర్ ఝా శుక్రవారం మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్తో కలిసి సందర్శించారు. గంజాయి నిర్మూలనతో పాటు గంజాయికి బానిసైన వారిలో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని డి-అడిక్షన్ కేంద్రాన్ని పరిశీలించి, వైద్యులతో మాట్లాడి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ 15 రోజుల చికిత్సా కాలంలో ప్రతి ఒక్కరిలో సానుకూల మార్పు రావాలని ఆకాంక్షించారు. వైద్య సిబ్బందితో మాట్లాడుతూ, గంజాయి బాధితుల్లో సత్ప్రవర్తన, సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, వారి ప్రవర్తనలో లేదా శారీరక పరిస్థితిలో ఏవైనా అసాధారణ మార్పులు గమనించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులను లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.
చికిత్స అనంతరం మళ్లీ మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. గంజాయి విక్రేతలు, మత్తు పదార్థాల సరఫరాదారులపై పోలీసుల నిరంతర నిఘా కొనసాగుతోందన్నారు. డ్రగ్స్ రహిత కమిషనరేట్ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీ ఐలు, వైద్యులు, ఇతర అధికారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.






