3 March, 2026 | 2:51 AM

హోలీ వేళ హద్దులు దాటొద్దు

03-03-2026 01:01 AM

సీపీ సజ్జనార్

బంజారాహిల్స్, మార్చి 2(విజయక్రాంతి): నగరంలో హోలీ పండుగను శాంతియుతంగా.. ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. సోమవారం టీజీఐసీసీసీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. బలవంతంగా రంగులు పూయడం, వాహనదారులు, పాదచారులపై రంగులు చల్లడం వంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ముఖ్యంగా మహిళల భద్రత కోసం నగరం అంతటా మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంటుందన్నారు. ఆకతాయిల ఆటకట్టిస్తామని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా హోలీ రోజున విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీపీ తెలిపారు. పండుగ వేడుకల్లో డీజేలకు అనుమతి లేదని, రోడ్లపై న్యూసెన్స్ చేసే వారి వాహనాలను సీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు.

రంజాన్ మాసం నడుస్తున్న నేపథ్యం లో ముస్లింల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పీస్ కమిటీల సమన్వయంతో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని, ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు.