19 August, 2026 | 8:50 PM

గైర్హాజరు కార్మికులకు కౌన్సిలింగ్

19-08-2026 08:08 PM

నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో వివిధ కారణాలతో గడిచిన ఏడు నెలల్లో 105 మస్టర్లు పూర్తి చేయకుండా విధులకు గైర్హాజరైన కార్మికులకు బుధ వారం RK 7 గనిలో మేనేజర్ తిరుపతి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు.  ఈ ఏడాది జనవరి 1 నుంచి జూలై 31 వరకు గడిచిన ఏడు నెలల్లో 105 మస్టర్లు పూర్తిచేయని 120  మంది ఉద్యోగులకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేయగా దాదాపుగా 70 మంది హాజరయ్యారు.

ఒక్కో ఉద్యోగి ఇప్పటి వరకు ఎన్ని మస్టర్లు చేశారు, లాంగ్ ఆబ్సెంటిజానికి గల కారణాలు అడిగి తెలుసుకొని నిర్దేశిత మస్టర్లు పూర్తి చేయకపోతే ఎదురయ్యే పరిణామాలను వివరించారు. కంపెనీ తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రతీ ఒక్కరు కచ్చితంగా తమకు కేటాయించిన విధులు నిర్వహించాలని సూచించారు. లేని పక్షంలో చాలా తీవ్రపరిణామాలు ఎదుర్కోవటమే కాదు ఉద్యోగం నుంచి డిస్మిస్ తప్పదని హెచ్చరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కసారి ఉద్యోగం కోల్పేతే సంస్థలో తిరిగి చేరే అవకాశం కష్టం అని హెచ్చరించారు.

ఈ మూడు నెలల్లో తప్పనిసరిగా 20 మస్టర్లకు కంటే ఎక్కువ డ్యూటీలు చేస్తామని హామీ పత్రంపై సంతకాలు తీసుకొని క్రమం తప్పకుండా విధులకు హాజరుకావాలని దిశానిర్దేశం చేశారు. మీరు విధులకు హాజరు కాకపోవడం వలన ఆర్థికంగా మీకే కాదు సంస్థకు సైతం నష్టం చేసినవారు అవుతారని, ఉద్యోగం చేస్తేనే ఇంటా బయట గౌరవం అని గుర్తేరిగి ఇకనుంచి అయినా సక్రమంగా విధులకు హాజరై సంస్థ అభ్యున్నతికి కృషిచేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ తిరుపతి, సంక్షేమ అధికారి సంతన్, పిట్ సెక్రటరీ సారయ్య  తదితరులు పాల్గొన్నారు.