05-02-2026 12:55:03 AM
కూకట్‌పల్లి ఎస్‌ఈ చిన్నారెడ్డి.. ప్రైవేట్ వ్యక్తి ద్వారా వసూళ్లు
15 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో..
మరోచోట టెన్త్ సెంటర్ కోసం చేయిచాచిన విద్యాశాఖ జూనియర్ అసిస్టెంట్
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దూ కుడు పెంచారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన అవినీతిని కడిగిపారేసేందుకు కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తు న్నది. లంచం తీసుకుంటే ఎంతటివారైనా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే అన్నట్లుగా ఏసీబీ అధికారులు వరుస దాడులతో విరుచుకుపడుతున్నారు. బుధవా రం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్‌పల్లి జోనల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ పీ చిన్నారెడ్డి ఏకంగా రూ. 15 లక్షల లంచం తీసుకుం టూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. మరో ఘటనలో విద్యాశాఖ ఉద్యోగి కూడా పట్టుబడ్డారు.
కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో ఎస్‌ఈగా పనిచేస్తున్న పీ చిన్నారెడ్డి.. ఒక కాంట్రాక్టర్ చేసిన రూ. 1.40 కోట్ల విలువైన పనుల బిల్లులను క్లియర్ చేయడానికి భారీ రేటు ఫిక్స్ చేశారు. ఆ ఫైల్ కదలాలంటే రూ. 15 లక్షలు ఇవ్వాల్సిందేనని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
అయితే చిన్నారెడ్డి నేరుగా డబ్బు తీసుకోకుండా, ఆఫీసులోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బాలసాని ప్రవీణ్ కుమార్‌ను మధ్యవర్తిగా వాడుకున్నారు. బాధితుడి నుంచి ప్రవీణ్ కుమార్ రూ. 15 లక్షలు తీసుకుంటుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. ఇంజినీర్ చిన్నారెడ్డితో పాటు ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు.
చిన్న మొత్తానికీ కక్కుర్తే..
లక్షల కొద్దీ లంచాలే కాదు, వేల రూపాయల కోసం చేయిచాచే వారిని కూడా ఏసీబీ వదలడం లేదు. బండ్లగూడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్.. పదో తరగతి పరీక్షా కేంద్రాల జాబితాలో ఓ ప్రైవేట్ స్కూల్ పేరును చేర్చేందుకు రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశారు. బుధవారం ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ సిటీ రేంజ్-2 బృందం అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
రికార్డు స్థాయిలో కేసులు..
గత మూడురోజుల్లోనే రాష్ట్రంలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఐ అబ్దుల్ హకీం, ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్‌కుమార్, తాజాగా ఎస్‌ఈ చిన్నారెడ్డి, అసిస్టెంట్ శివప్రసాద్ పట్టుబడ్డారు. 2025లో 273 మందిని అరెస్టు చేసిన ఏసీబీ, ఈ ఏడాది ఆరంభం నుంచే అదే జోరును కొనసాగిస్తోంది. ఏ శాఖలోనైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే.. సామాన్యులు భయపడకుండా 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదుచేయాలని ఉన్నతాధికారులు సూచించారు.
మహిళా ఉద్యోగులపైనా కొరడా..
ఇదిలాఉండగా గతంలో పురుష అధికారులే ఎక్కువగా పట్టుబడగా, ఇటీవల కాలంలో మహిళా అధికారులు కూడా లంచం తీసుకుంటూ వరుసగా పట్టుబడుతుండటం విశేషం. వారం రోజుల క్రితం ఓ మహిళా తహసీల్దార్, అంతకుముందు ఓ మహిళా సబ్-రిజిస్ట్రార్, పంచాయతీ రాజ్ శాఖకు చెందిన మరో మహిళా అధికారి ఏసీబీ వలలో చిక్కుకున్న ఘటనలు జరిగాయి. ఉన్నత పదవుల్లో ఉన్న మహిళా అధికారులు సైతం ధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతుండటంతో ఏసీబీ వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది.