15వ అంతస్తు నుంచి పడి కార్మికుడు మృతి
ఘట్ కేసర్, ఆగస్టు 8 (విజయక్రాంతి) : మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్, పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. వరంగల్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న హరిహర కన్ స్ట్రక్షన్స్ కు చెందిన 'కాకతీయ అపార్ట్‌మెంట్స్' నిర్మాణంలో ఈ విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం 15వ అంతస్తులో పెయింటింగ్ పనులు చేస్తుండగా మధ్యప్రదేశ్‌కు చెందిన వినోద్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తూ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కార్మికులకు కనీస భద్రతా పరికరాలు అందించకుండానే లేబర్ కాంట్రాక్టర్ దుర్గాప్రసాద్, బిల్డర్లు పనులు చేయిస్తున్నారని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోచారం ఐటి కారిడార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






