9 August, 2026 | 9:53 AM

ఇందిరా మహిళా శక్తి భవనం పనులను వేగవంతం చేయాలి

09-08-2026 08:16 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, ఆగస్టు 8 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. శనివారం  భవన నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భవనం అందుబాటులోకి వస్తే మహిళా సంఘాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. భవనానికి సంబంధించి మిగిలి ఉన్న బ్యాలెన్స్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు.

ముఖ్యంగా విద్యుత్ సరఫరా, తాగునీటి వసతి, పెయింటింగ్ మరియు ఫినిషింగ్ పనుల్లో ఎక్కడా జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను, సంబంధిత శాఖా అధికారులను ఆదేశించారు. భవనం ప్రారంభమైతే జిల్లాలోని మహిళా సంఘాల కార్యకలాపాలకు, శిక్షణ కార్యక్రమాలకు వేదికగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సన్యాసయ్య, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.