కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా కూడేల్లి ప్రవీణ్ కుమార్ నియామకం
గంభీరావుపేట, ఆగస్టు 8 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ముస్తఫానగర్ గ్రామానికి చెందిన కూడేల్లి ప్రవీణ్ కుమార్‌ను నియమిస్తూ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పండుగ ప్రదీప్ ఉత్తర్వులు జారీ చేశారు.పార్టీ పట్ల ఆయన కట్టుబాటు, సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్రను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మండలంలో ఎస్సీ వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు, పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.
ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఎస్సీ వర్గాల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలో పార్టీ కార్యక్రమాలను విస్తరించడంతో పాటు యువతను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతానని చెప్పారు. అలాగే పార్టీ జిల్లా, మండల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. నియామకాన్ని పలువురు నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తూ అభినందనలు తెలిపారు.






