డీలిమిటేషన్ బిల్లు వెనుక రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
జై భీం, జై బాపు, జై సంవిధాన్ మండల కో-ఆర్డినేటర్ జీడి వీరస్వామి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లు (నియోజకవర్గాల పునర్విభజన) ద్వారా భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు,దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని జై భీం, జై బాపు, జై సంవిధాన్ మండల కో-ఆర్డినేటర్, తిమ్మాపురం గ్రామ మాజీ సర్పంచ్ జీడి వీరస్వామి తీవ్రస్థాయిలో ఆరోపించారు. సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ... డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల దేశ సమాఖ్య వ్యవస్థకు ప్రమాదం వాటిల్లుతుందని,జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా నియోజకవర్గాల పునర్విభజనకు మహిళా రిజర్వేషన్లతో ముడిపెట్టి రాజ్యాంగంలోని అధికరణలను మార్చాలని చూస్తుందని ఆయన ఆరోపించారు.జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగితే జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాల ఎంపీ సీట్లు తగ్గి ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.






