హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
మేడ్చల్, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బి ఆర్ ఎస్ నాయకులు విమర్శించారు. బి ఆర్ ఎస్ పిలుపుమేరకు ఆ పార్టీ నాయకులు శామీర్ పేట్ లో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ధర్నాతోపాటు బాకీ కార్డులు పంపిణీ చేశారు. భారీ ఫ్లెక్సీ తో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
సందర్భంగా జిల్లా రైతు అధ్యక్షుడు అయ్యన్న గారి రవి కిరణ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో అన్ని రంగాల వారికి అన్యాయం చేసిందన్నారు. రైతులకు 100% రుణమాఫీ చేయలేదని, మహిళలకు ప్రతినెల రూ.2500 ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. రైతుబంధు, రైతు బీమా పథకాలు సరిగా అమలు కావడంలేదని, యూరియా సరఫరా చేయడం లేదని, చివరికి పంట ఉత్పత్తులను కూడా సరిగా కొనుగోలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, తూముకుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వర్ రావు, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు అనిత, మాజీ ఎంపీపీ ఎల్లుబాయి, ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






