ఆలేరు మున్సిపల్ మడిగ కబ్జాపై ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు..
ఆలేరు, ఆగస్ట్ 17 (విజయక్రాంతి): ఆలేరు పట్టణంలోని రంగనాయకుల గుడి ముందు ఉన్న 5-5 ఇంటి నంబర్‌కు సంబంధించిన మున్సిపల్ మడిగ కబ్జాకు గురైందని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్టెగొమ్ముల విద్యాసాగర్ రెడ్డి మున్సిపల్ మడిగను కబ్జా చేశారని ఆరోపిస్తూ గణగాని సంపత్ కుమార్ గౌడ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
గత 60 సంవత్సరాలుగా సదరు మడిగలో నివసిస్తూ, వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఘనగాని ఐలయ్య కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, మున్సిపల్ రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మడిగ కబ్జా జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయితే మున్సిపల్ ఆస్తిని స్వాధీనం చేసుకుని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 60 ఏళ్లుగా ఈ మడిగపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని గణగాని సంపత్ కుమార్ గౌడ్ తెలిపారు.






