16 May, 2026 | 10:51 PM

మార్కెట్ యార్డ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

16-05-2026 09:52 PM

* కొనుగోలు ఇబ్బందులు తొలగించేలా మరో 5 తూకం కాంటాల ఏర్పాటుకు ఆదేశం

ఆదిలాబాద్,(విజయక్రాంతి): రైతులకు ఇబ్బందులు కలగకుండా, మార్కెట్ యార్డులో సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. శనివారం ఆదిలాబాదు వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి, కాంటా (తూకం) నిర్వహణ, పట్టీల జారీ, మార్కెట్‌లో మౌలిక వసతుల కల్పనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, ఫిర్యాదులపై సానుకూలంగా స్పందిస్తూ, మార్కెట్‌లో నెలకొన్న రద్దీని, రైతులపై ఉన్న భారాన్ని తగ్గించడానికి ప్రస్తుతమున్న కాంటాలకు అదనంగా మరో ఐదు కాంటాలను (తూకం కేంద్రాలను) తక్షణమే పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే, రైతులకు ఇబ్బంది కలగకుండా కజ్జర్ల, తలమడుగు గోదాములలో సైతం తగిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా వృద్ధ రైతుల పట్ల అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించి, మొదటి ప్రాధాన్యత ఇచ్చి, కాంటా పూర్తి చేయాలన్నారు.

దీనితో పాటు మార్కెట్ యార్డ్‌లో రైతులకు కనీస వసతుల కల్పనలో ఎలాంటి అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. ఎండ తీవ్రత దృష్ట్యా రైతులకు నీడ కోసం అవసరమైన చోట టెంట్లు (షామియానాలు) ఏర్పాటు చేయాలని, స్వచ్ఛమైన త్రాగునీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. అలాగే, రాత్రి వేళల్లో రైతుల రక్షణ, వారి తెచ్చిన పంట దొంగతనాలకు గురికాకుండా ఉండేందుకు మార్కెట్ యార్డ్ పరిధిలో నైట్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు 20 వేల గన్ని సంచులు మార్కెట్ కు రావడం జరుగుతుందని, అధిక మొత్తం లో మార్కెట్ కు జొన్న పంటను తీసుకు రావడం జరుగుతుందని, రవాణా, హమాలీల కొరత సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.