అంజనేయ స్వామికి కలెక్టర్ హరిత పూజలు
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని కేస్లాపూర్ అంజనేయ స్వామి ఆలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ కె. హరిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా స్వామివారికి నిర్వహించిన అభిషేకాలు, అర్చనలు కార్యక్రమాలలో కలెక్టర్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కలెక్టర్ కు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు. పండుగ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారం, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




