1 September, 2026 | 11:33 PM

అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు

01-09-2026 | 11:06pm

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల అమలు, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) వ్యాప్తంగా నిర్వహించిన అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్(Arrive Alive special drive)లో భాగంగా ఆగస్టు 01 నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖ, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చలాన్లు విధించడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

ఈ మేరకు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sirisetty Sankeerth) వివరాలు వెల్లడించారు. ఆగస్టు 01 నుండి 31 వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 256 కేసులు నమోదు చేయగా 187 మోటార్ వాహనాలు, 69 గూడ్స్ క్యారియర్ వాహనాలు సీజ్ చేయడం జరిగిందని అదేవిధంగా విధించిన జరిమానా మొత్తం రూ.13,70,800 ఉంటుందని ఎస్పీ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రతి ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడమే అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు.