2 June, 2026 | 6:27 PM

Breaking News

విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో విశేష సేవలు అందించిన లైన్‌మ్యాన్ దేవ్ సింగ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు   •   మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •   గుంజపడుగు గ్రామంలో వ్యర్థాలపై ప్రజలకు సర్పంచ్ అవగాహన   •   ఘనంగా అవతరణ వేడుక   •   పలు గ్రామాల్లో పీసీసీ కేంద్రాలను సందర్శించిన డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు   •   పట్టపగలే యదేచ్చగా మొరం తవ్వకాలు.. చోద్యం చూస్తున్న అధికారులు   •   అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు   •   కాగజ్‌నగర్ సభలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు   •   పరిపాలన చేతకాక సీఎం బూతు మాటలు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే తలసాని   •   రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉద్యమకారులు, పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం   •  

ముఖ్యమంత్రి ప్రసంగం జిల్లా ప్రజలకు నిరాశ కలిగించింది

02-06-2026 05:16 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం జిల్లా ప్రజల ఆశలను నెరవేర్చలేకపోయిందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దుర్గం దినకర్ విమర్శించారు. జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గుండి, తుంపల్లి, లక్మాపూర్ వంతెనల నిర్మాణాలపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం నిరాశ కలిగించిందన్నారు. గుండి బ్రిడ్జి నిర్మాణం సంవత్సరాలుగా కొనసాగుతుండగా, వర్షాకాలంలో గ్రామస్తులు ఇప్పటికీ నాటు పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు.

తుంపల్లి, లక్మాపూర్ ప్రాంతాల్లోనూ వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతంలో వరదల్లో ప్రాణనష్టం జరిగిన ఘటనలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రికి భారీ భవనాలు, ఖరీదైన వైద్య పరికరాలు ఉన్నప్పటికీ ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని, ఆసుపత్రి కేవలం ప్రాథమిక చికిత్సకే పరిమితమై రిఫరల్ ఆసుపత్రిగా మారిందని ఆరోపించారు. మండల కేంద్ర ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని, ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

విద్యారంగంలోనూ జిల్లా వెనుకబాటుతనాన్ని ప్రస్తావించిన దుర్గం దినకర్, అనేక విద్యాసంస్థలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని, వర్షాకాలంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఐటీఐ కళాశాలను మంజూరు చేయాలని, గత ఏడాది ప్రారంభించిన డీఈడీ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వెనుకబడిన కుమురం భీం జిల్లాకు రహదారులు, వంతెనలు, విద్య, వైద్య రంగాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తుందని ప్రజలు ఆశించారని, కానీ సభలో అలాంటి హామీలు రాకపోవడంతో నిరాశ మిగిలిందన్నారు.