26 August, 2026 | 10:29 AM

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

26-08-2026 09:37 AM

కోదాడ : సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర కంటైనర్‌ను ఢికొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో(Suryapet Road Accident) మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

అలాగే, క్షతగాత్రుల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. బుధవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ఆగిఉన్న కంటైనర్ వాహనాన్ని (DCM) ఢీకొట్టడంతో ఆరుగురు మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. కోదాడ మండలంలోని దొరకుంట శివార్లలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ప్రాథమిక సమాచారం ప్రకారం, హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు, ఆగి ఉన్న కంటైనర్ వాహనాన్ని (DCM) ఢీకొట్టింది. ఈ ఢీకొన్న తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. దీనివల్ల పలువురు ప్రయాణికులు అందులోనే చిక్కుకుపోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.